నీరాజనసీమ

అంబాజీపేటలో అభివాదం

అడుగడుగునా ఘన స్వాగతం

కొబ్బరికి పూర్వవైభవం తెస్తాం

బహిరంగ సభలో చంద్రబాబు, పవన్‌

అంబాజీపేట,అమలాపురంల్లో సక్సెస్‌

అమలాపురం/అంబాజీపేట (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 11 : కోనసీమలో గన్నవరం గర్జించించిం ది.. అమలాపురం అదరగొట్టింది.. కోనసీమ టీడీ పీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యా ణ్‌లకు నీరాజనసీమగా మారింది..ఎటు చూసినా జనమే.. ఎక్కడ చూసినా జనమే.. ఎక్కడి కక్కడ పువ్వులు చల్లుతూ అభిమాన నేతలకు ఘనంగా స్వాగతం పలికారు.. కోనసీమ అభిమానం రుచి చూపించారు..టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రోడ్‌షోకు ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతాలు పలికారు. మహిళలైతే రోడ్లపైకి వచ్చి హారతులు ఇచ్చారు. ఆరు కిలోమీటర్ల రోడ్‌షో గంటన్నర సమయం పైగా సాగింది. రోడ్లకు ఇరువైపులా వేల సంఖ్యలో ప్రజలు బారులు తీరి స్వాగతం పలికారు. అంబాజీపేటలో మెయిన్‌రోడ్డుమీదా, అమలాపురంలో గడియార స్తంభం సెంటర్‌లో సభ, రోడ్‌షో సుమారు నాలుగు గంటలపాటు జరిగాయి. దీంతో నేతలు ఉబ్బితబ్బిబయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు ఈసారి స్థానిక సమస్యలపైనే దృష్టి సారించి రెండు సభల్లోను ప్రసంగాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దంపట్టే స్పందన ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికలు లాంఛనమే. మనమే గెలుస్తున్నాం. మన ఆడబిడ్డల స్పందన చూ స్తుం టే, వీర వనితలు అయితే ఎప్పుడు పోలింగ్‌ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సిద్ధం అం టున్న జగన్‌కు ఇక యుద్ధమేనని చంద్రబాబు అన్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో గాజు గ్లాసు..అమలాపురంలో సైకిల్‌ గుర్తులకు ఓట్లేసి తద్వారా జగన్మోహన్‌రెడ్డి గుండెల్లోకి గుచ్చేందుకు చూస్తున్నారు. సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్‌ను తన్ని తరిమికొట్టాలన్నారు. కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి అన్నారు. బాలయోగిని స్పీకర్‌గా చేసిన పార్టీ టీడీపీ అన్నారు. గోదావరి జిల్లాలో చిచ్చుపెట్టి చలికాచుకునే పరిస్థితుల్లో జగన్‌ ఉన్నాడని చంద్రబాబు విమర్శించారు. గోదావరి ఉన్నా మీకు ఇసుక అందుతుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రూ.1000కే ఇసుక అందేదన్నారు. ఇప్పుడు రూ.5 వేలు ఇస్తేకానీ ఇసుక రావడంలేదన్నారు. ఎవరి కిపోతున్నాయి ఈ డబ్బులు అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని చంద్రబాబు అన్నారు. కోనసీమ కొబ్బరికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషిచేస్తానన్నారు. అలాగే వరికి గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద నుంచి పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం హలో ఏపీ… బై బై జగన్‌ అంటూ చంద్రబాబు ప్రజలతో నినాదాలు చేయించారు. పవన్‌కల్యాణ్‌ మాత్రం స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల సమక్షంలో ఎండగట్టారు. బాబు చిట్టి అంటూ.. పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు పేరు ప్రస్తావించకుండా ఆయనపై విమర్శనాస్ర్తాలు సంధించారు. జగన్‌ గన్నవరం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే చిట్టిబాబు సూచించిన రూ.200 కోట్ల విలువైన హామీలను అయితే ఇచ్చేశారు. ఇప్పటివరకు వాటికి అతీగతీ లేదు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నుంచి గోదావరి రివెట్‌మెంట్లు, కాజ్‌వేల నిర్మాణం, నాడు-నేడు వంటి అంశాలపై వివరణాత్మక విశ్లేషణ చేస్తూ జగన్‌ ఈ ప్రాంత ప్రజలను ఏవిధంగా మోసగించారో స్పష్టంచేశారు. బాలయోగి జీవిత లక్ష్యమైన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ను నిర్మించి పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తామన్నారు.ఆర్బీకేలు కాకినాడకు చెందిన ఒకమాఫియా లీడర్‌ చేతిలో ఉన్నాయని ఆరోపించారు. యువత ఇంటి వద్దే ఉండి ఉపాధి పొందేలా వర్క్‌ ఫ్రమ్‌ హోం మాదిరిగా ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తెలుగుదేశం లక్ష్యమని చంద్రబాబునాయుడు అమలాపురం సభలో స్పష్టం చేశారు. చంద్రబాబు తన ప్రసంగాన్ని సూపర్‌-10 పథకాలను వివరిస్తూ సరిగ్గా 9.55 గంటలకు ముగించారు. చంద్రబాబునాయుడు కిమ్స్‌లో నైట్‌ హాల్ట్‌కు బయలుదేరి 10.15 గంటలకు చేరుకున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అమలా పురం నుంచి నేరుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని నివాసానికి వెళ్లారు.

సంక్షేమం పేరుతో మంత్రి దోపిడీ : చంద్రబాబు

స్థానిక మంత్రి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వంద ఎకరాల భూమిని సేకరించారు. ఎకరాకి రూ.10 లక్షలు చొప్పున మింగేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి 50 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ప్రభుత్వం రూ.75 లక్షల చొప్పున చెల్లిస్తే రైతులకు రూ.50 లక్షలు మాత్రమే ఇచ్చి ఎకరాకు రూ.25 లక్షలు చొప్పున మింగేశారు. మునిసిపల్‌ పార్కింగ్‌ స్థలాన్ని మంత్రి అనుచరులే అద్దెకు తీసుకున్నారు. అమలాపురంలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తా. చేనేత కార్మికులకు రూ.24వేలు పథకాన్ని కొనసాగిస్తాం.40లక్షల మంది భవన నిర్మాణరంగ కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటా. జిల్లా కేంద్రమైన ఈ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నికల్‌ కళాశాల, ఐటీఐలను ప్రభుత్వపరంగా ఏర్పాటుచేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.వారి కోసం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటాం. అమలాపురంలో శెట్టిబలిజ కల్యాణ మండపం నిర్మించాలని కోరగా ఆయన సమ్మతించారు.పనులు చేసే బాధ్యత మాది, కూటమికి ఓటేసి గెలిపించే బాధ్యత మీదని చంద్రబాబు అన్నారు.

ఎవడ్రా మనల్ని ఆపేది : పవన్‌

కుల వైషమ్యాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అమలాపురం సభలో ఆరోపించారు. పచ్చని కోనసీమను కలహాల సీమగా మార్చేశారు. ఇక్కడ కులాల మధ్య అంబేడ్కర్‌ పేరును లక్ష్యంగా చేసుకుని చిచ్చు పెట్టారు. లబ్ధి పొందాలని చూశారు. వైసీపీ మంత్రి ఇల్లును ఆ పార్టీవారే తగలు పెట్టుకునేలా చేశారన్నారు. కోనసీమ రైల్వేలైన్‌ లక్ష్య సాధనగానే ఉమ్మడి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. జనసేనను కొందరు నాయకులు వదిలి వెళ్లిపోయారు. నాయకులు వస్తారు వెళతారు. కానీ పార్టీని అంటిపెట్టుకుని ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది జనసైనికులు, వీర మహిళలేనన్నారు.గతంలో అమలాపురం సభలో హలో ఏపీ.. బైబై వైసీపీ అనే స్లోగన్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించారు. మనల్ని ఆపేది ఎవడ్రా అంటూ పవన్‌ ఆగ్రహంగా ప్రసంగించారు.

నా తండ్రి..బాలయోగి ఆశయ సాధనకు కృషి

ఐదేళ్ల రాక్షస పాలనలో ప్రజలెన్నో కష్టాలు పడ్డారు. మరో 32 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. రానున్నది డబుల్‌ ఇంజన్‌ సర్కారే.. అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంట్‌ పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. నా తండ్రి.. దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి ఆశయ సాధనకు కృషిచేస్తా. కోనసీమ ప్రజల చిరకాలవాంఛ రైల్వేలైన్‌ పూర్తయ్యే విధంగా కృషిచేసి ఈ ప్రాంత వాసులకు రైల్వే కూత వినిపిస్తా.

– హరీష్‌మాధుర్‌, అమలాపురం పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి

అవకాశం ఇస్తే.. మంచి చేసి చూపిస్తా..

పి.గన్నవరం నియోజకవర్గంలో సమస్యలపై దృష్టి సారించా.. కొత్తగా వచ్చానని అనుకోవద్దు.. ఇప్పటి వరకూ పోలీస్‌ సేవలో ఉన్నా.. అవకాశం ఇస్తే మంచిచేసి చూపిస్తా.. నదీపరీవాహక ప్రాంతాల్లో గ్రోయిన్స్‌, రివిట్‌మెంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటా.కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి.నాకున్న అనుభ వంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.

– గిడ్డి సత్యనారాయణ, పి.గన్నవరం జనసేన అభ్యర్థి

జగన్‌ దుర్మార్గాలకు ఓటుతో బుద్ధి చెప్పండి

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు సమయం ఆసన్నమైంది.. జగన్‌ దుర్మార్గాలకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటుచేసి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదే.. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతమొందించడానికి, దోపిడీలను అరికట్టడానికి, మాఫియాలకు గుణపాఠం చెప్పడానికి మోసగాడు జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజల వద్ద ఉన్న వజ్రాయుధమే ఓటు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *