అల్లూరి సీతారామరాజు, (1897 జూలై 4 – 1924 మే 7) భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
వంశం
సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు. ఇతనికి ఆరుగురు కుమారులు — వెంకట కృష్ణంరాజు, సీతారామరాజు, గోపాలకృష్ణంరాజు, వెంకట నరసింహరాజు, అప్పలరాజు, వెంకట రామరాజు. వీరిలో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణంరాజు (సీతారామరాజుకు తాత), వెంకటకృష్ణంరాజు, అతని పెదతండ్రి వెంకట నరసింహరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరపడ్డారు. వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడుకులు రామచంద్రరాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు. అల్లూరి సీతారామరాజు (తెలుగు వైతాళుకులు శీర్షికలో లఘుగ్రంథం) – రచన: ఆచార్య కలిదిండి వెంకట రామరాజు – ప్రచురణ: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాదు
బాల్యం, చదువు
సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి – 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం. వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు,అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు.
రాజు తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయికముగా చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివాడు. చిత్రకళలోను, ఫొటోగ్రఫీలోను అభిరుచి కలవాడు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.
ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం అలా సాగింది.
1909లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో మిషన్ ఉన్నత పాఠశాలలో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమహేంద్రవరం ఆరవ తరగతి, 1912లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారంలో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.
రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంగి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్లనూ పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురంలో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తునిలో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడుకాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేసాడు.
రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.
చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.
రాజు గురించి
సీతారామరాజు జీవితచరిత్ర గురించిన బుర్రకథలు,నాటికలు, సినిమా విడుదలయ్యాయి.
RRR లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా చేసిమెప్పించాడు
అల్లూరి సీతారామరాజు ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. సినిమాలో కృష్ణ, విజయనిర్మల,
